కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం

కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం
  • కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్, బీర్కూర్​ మండలాల్లోని మూడు గ్రామాలకు చెందిన 68 మందికి అస్వస్థత
  • 23 కేసులు నమోదు, 18 టీఎఫ్టీ లైసెన్సులు రద్దు

బాన్సువాడ/కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు కలకలం రేపుతోంది. నస్రుల్లాబాద్, బీర్కూర్​ మండలాల్లోని 4 గ్రామాలకు చెందిన  68 మంది సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఇందులో 17 మందిని నిజామాబాద్, కామారెడ్డి గవర్నమెంట్​ హాస్పిటల్స్​కు తరలించారు. నస్రుల్లాబాద్​ మండలంలోని అంకోల్, అంకోల్​ తండా,  దుర్కి,  బీర్కూర్​ మండలం దామరంచకు చెందిన వారు కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు బాన్సువాడ గవర్నమెంట్​ హాస్పిటల్​లో ట్రీట్మెంట్​ చేయిస్తున్నారు. కల్తీ కల్లుకు కారణమైన డిపోను సీజ్​ చేయడంతో పాటు ఎక్సైజ్​ అధికారులు 23 కేసులు నమోదు చేశారు. 18 టీఎఫ్టీ లైసెన్సులు రద్దు చేశారు. 

శాంపిల్స్​ ల్యాబ్​కు పంపుతున్నాం

బాన్సువాడకు మంగళవారం ఎక్సైజ్​ డిప్యూటీ కమిషనర్​ సోమిరెడ్డి వచ్చి ఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. దుర్కి డిపోలో కల్తీ కల్లు తయారు చేసి సప్లయ్​ చేయడంతోనే 4 గ్రామాలకు చెందిన 68 మంది అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. దుర్కికి చెందిన సురేందర్​గౌడ్, అతని తండ్రిని అరెస్ట్​ చేశామన్నారు.  సాయాగౌడ్​ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పారు. కల్లు శాంపిల్స్​ ల్యాబ్​కు పంపామని, రిపోర్టు వచ్చిన తరువాత నార్కోటిక్స్​ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. 

గౌరారంలో 9 మందికి..

గాంధారి మండలం గౌరారంలో కల్తీ కల్లు కలకలం రేపింది. మంగళవారం రాత్రి ఇక్కడ 9  మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని బాన్సువాడ ఏరియా హాస్పిటల్​కు తరలించారు. గ్రామంలో 3 రోజులుగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. పక్క ఊర్ల  నుంచి బంధువులు వచ్చారు. కల్లు అందుబాటులో లేకపోవటంతో బాన్సువాడ ఏరియా నుంచి కల్లు తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. గ్రామాన్ని డీఎంహెచ్​వో చంద్రశేఖర్​, డీసీహెచ్​వో విజయలక్ష్మి సందర్శించారు.